గుంటూరు ఆసుపత్రికి రూ 20 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన ప్రవాస వైద్యురాలు

యాభై ఏళ్లుగా అమెరికాలో వైద్యవృత్తితో కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేశారు ఓ ప్రవాస భారతీయ మహిళా వైద్యురాలు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్‌ ఉమ గవిని తన ఆస్తినంతా తాను చదివిన గుంటూరులోని ప్రభుత్వ వైద్యకళాశాల ఇచ్చేశారు. చివరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా మిగుల్చుకోలేదు. మొత్తం రూ.20 కోట్ల (2.50 లక్షల డాలర్లు) ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి ఆమె విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఉమా ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలి్‌స్టగా పనిచేస్తున్నారు.  ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్‌ చేశారు. అనంతరం ఉన్నత విద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు.
గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్‌ సమావేశాల్లో ఉమా పాల్గొన్నారు. తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆమె అక్కడి వేదిక మీదే ప్రకటించారు.  ఆస్తిలో 80 శాతం, 90 శాతం దానం చేసే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అమెరికాలో కనిపిస్తారు. అలాచూస్తే ఉమా ఔదార్యం వారిని కూడా మించిపోయింది. చేతిలో డాలర్‌ కూడా దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్థి మొత్తాన్ని ఇచ్చేశారు.

Related Posts

Latest News Updates