ప్రతి యేడాది లాగే ఈ సంవత్సరం కూడా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహించారు. ఆయన తరపున కూతురు విజయలక్ష్మి ఈ అలయ్ బలయ్ ను నిర్వహించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రవచన కారుడు గరికిపాటి నరసింహారావు, మెగాస్టార్ చిరంజీవితో పాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, బీజేపీ నేతలు రాంచందర్ రావు, కపిలవాయి దిలీప్ కుమార్, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, రామకృష్ణ, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ… తెలంగాణ మంచి సంస్కృతి సంప్రదాయాలు కలిగిన రాష్ట్రం అని అన్నారు. దత్తన్న ప్రారంభించిన అలయ్ బలయ్ కార్యక్రమం అద్భుతం అని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు నుండి మనం ప్రేరణ పొందాలని సూచించారు. మన వాళ్లనే కాదు అందరిని ప్రేమించాలనే తత్వం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అని వివరించారు. అంతేకాకుండా అలయ్ బలయ్ బ్యాంక్ గ్రౌండ్ తో ఓ సినిమా రూపొందించాలని మెగాస్టార్ కు గవర్నర్ సూచించారు.