జనాభా అసమతుల్యత, జనాభా మార్పుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ దేశంలో సమగ్రమైన జనాభా విధానం రూపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ పిలుపిచ్చారు. నాగపూర్ లో వార్షిక విజయదశమి ఉత్సవంలో ప్రసంగిస్తూ మన జనాభాలో 57 శాతం మంది యువత ఉన్నారని గుర్తు చేశారు. అందుకనే, మన ప్రజల విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర అంశాల గురించి మనం 50 సంవత్సరాల ముందు ఆలోచించాలని, ఈ దృష్టిలో సమగ్రమైన జనాభా విధానాన్ని రూపొందించుకోవాలని సూచించారు. ఇండోనేషియా, సూడాన్ మరియు సెర్బియాలో జనాభా అసమతుల్యత ఫలితంగా తూర్పు తైమూర్, దక్షిణ సూడాన్, కొసావో ఉద్భవించాయని ఆయన గుర్తు చేశారు.
“జనాభా అసమతుల్యత భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు దారి తీస్తుంది. జనన రేటులో తేడాలతో పాటు, బలవంతంగా మారడం, ప్రలోభాలు, చొరబాట్లు చొరబాటు కూడా పెద్ద కారణాలు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించాలి. జనాభా నియంత్రణ, మత ఆధారిత జనాభా సమతుల్యత అనేది ఇకపై విస్మరించలేని ముఖ్యమైన అంశం” అని ఆయన స్పష్టం చేశారు.
పరిమిత వనరులను దృష్టిలో ఉంచుకుని జనాభా విధానాన్ని రూపొందించాలని ఆయన చెప్పారు. “మన దేశంలో భారీ జనాభా ఉంది. ఇది వాస్తవం. ప్రస్తుతం జనాభాపై రెండు రకాల మూల్యాంకనం జరుగుతోంది. జనాభాకు వనరులు అవసరం. అవి పెరుగుతూ ఉంటే, అవి పెద్ద భారంగా మారతాయి. బహుశా మోయలేని భారంగా మారతాయి. అందువల్ల, జనాభా నియంత్రణ దృక్పథంతో, ప్రణాళికలు రూపొందించాలి” అని డా. భగవత్ తెలిపారు.