తెలంగాణ రాష్ట్రానికే ఏమీ చేయలేకపోయిన సీఎం కేసీఆర్.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో దేశానికి ఏం చేస్తారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2018 వరకు మంత్రివర్గంలో మహిళలకు అవకాశం కల్పించలేదని మండిపడ్డారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలుత మహిళలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని.., ప్రతిపక్షాలు మీడియా ప్రశ్నించడంతో మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించారన్నారు. మహిళలను మంత్రివర్గంలో పెట్టుకుంటే మంచిది కాదని తాంత్రికుడు చెప్పడంతో మహిళలకు అవకాశం కల్పించలేదని ఆరోపించారు.
తెలుగు భాషతో పాటు తెలంగాణను మర్చిపోతున్న టీఆర్ఎస్ దేశానికి ఏం చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో కొత్త రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంతో చుక్క నీరు రాలేదని, ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షా 40వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తామన్న కేసీఆర్ ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశాడన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి తెలంగాణ ప్రజలపై భారాలు వేశారని ఆరోపించారు. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. రాష్ట్రంలో ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే.. మంత్రాలు, తంత్రాలు నెపంతో కేసీఆర్ సచివాలయానికి వెళ్లటం లేదన్నారు. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందన్నట్లుగా రాష్ట్రానికి ఏం చేయలేని కేసీఆర్.. జాతీయ పార్టీ పెట్టి ఏం ఉద్దరిస్తారని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.