కేరళలోని 9 యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశించారు. సోమవారం ఉదయం 11.30 లోపు రాజీనామా పత్రాలు తనకు అందాలని స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్ స్వయంగా ఆదివారం చేసిన ట్వీట్ కలకలం రేపింది. గవర్నర్ చేసిన ట్వీట్‌లో అక్టోబర్ 24లో ఉదయం 11.30 లోపు రాజీనామాలు చేయాలని కేరళలోని తొమ్మిది యూనివర్శిటీల వైస్‌ఛాన్సలర్లకు లేఖలను ఇామెయిల్ ద్వారా పంపినట్లు పేర్కొన్నారు.
కేరళ యూనివర్శిటీ, ఎంజి యూనివర్శిటీ, కొచిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఒషన్ స్టడీస్, ఎపిజె అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్శిటీ, శ్రీ శంకరాచార్య సంస్కృత్ యూనివర్శిటీ, కాలికుట్ యూనివర్శిటీ, తుంచత్ ఎజుథచన్ మలయాళం యూనివర్శిటీ, కన్నూర్ యూనివర్శిటీల విసిలకు గవర్నర్ ఈ మేరకు లేఖలు పంపారు. కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలాజీకల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎం ఎస్ రాజశ్రీ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాజీనామా లేఖలు కోరారు. దీంతో ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
తీవ్రంగా స్పందించిన సీపీఎం
అయితే.. గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆరెస్సెస్ కి చెందిన వారిని వీసీ పదవుల్లో కూర్చోబెట్టాలని గవర్నర్ చూస్తున్నారని, అందుకే తొమ్మిది మందిని రాజీనామా చేయాలని ఆదేశించారని సీతారాం ఏచూరీ ఆరోపించారు. అయితే… ఇలాంటి నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్ కు లేదన్నారు. పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని, చట్ట విరుద్ధమని అన్నారు. అంతేకాకుండా ఈ నిర్ణయం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, విద్యా వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్నారని ఏచూరీ మండిపడ్డారు.