తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం పట్ల ఆనందభాస్కర్‌ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేనేతపై 5% జీఎస్టీ విధించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకొన్నారు. అధికార టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధపడిపోయారు. ఈ మేరకు రాపోలు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.

 

 

రాష్ట్రంలో చేనేతరంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం ద్వారా చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సామాజికవర్గానికి చెందిన తాను.. బీజేపీ చేస్తున్న ఈ నిర్వాకాన్ని చూస్తూ భరించలేనని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలను ప్రజలపై రుద్దారని, బీజేపీ కాంట్రాక్టర్ల పార్టీగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌)లో చేరుతానని సీఎం కేసీఆర్‌తో చెప్పారు. భారత్‌ రాష్ట్ర సమితి ద్వారా జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.