ఏపీ బీజేపీలో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడి మధ్య నేరుగానే విమర్శల పర్వం ప్రారంభమైంది. జనసేన పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ తర్వాత… ఈ పరిణామం జరగడం ఆసక్తికర పరిణామం. బీజేపీ అంటే తనకు అభిమానమే కానీ.. ఆ పార్టీకి ఊడిగం చేయనని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని పవన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా దీనిపై సానుకూల సంకేతాలిచ్చారు. దీంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పవన్ తో కలిసి ముందుకు సాగాలని బీజేపీ జాతీయ నాయకత్వం డిసైడ్ అయ్యింది. కానీ… పవన్ ఒక్కసారిగా చంద్రబాబుతో కలిసి పయనిస్తున్నట్లు సంకేతాలివ్వడంతో రాజకీయ ముఖచిత్రం మారింది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీతో బీజేపీలో ప్రకంపనలు మొదలయ్యాయి.
పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగా విమర్శలకు దిగారు. ర్టీలో ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదని, పవన్ కల్యాణ్‌తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. అన్నీ తానే అయినట్టు వ్యవహరించడం వల్లనే సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు. తన అభిప్రాయాలను ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోవడంలేదని సోము వీర్రాజుపై ఇప్పటికే రెండుసార్లు విమర్శలు గుప్పించిన కన్నా.. తాజాగా మరోసారి ఆయన తీరుపై అసహనం వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అలసత్వం వల్లనే టీడీపీ అధినేత చంద్రబాబు పవన్‌కల్యాణ్‌తో సమావేశమయ్యారన్నారు. బుధవారం సాయంత్రం గుంటూరు లోని తన నివాసంలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని కన్నా అనుచర వర్గాలు తెలిపాయి.
అయితే.. కన్నా విమర్శలపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. న్నా లక్ష్మీనారాయణ తమ పార్టీలో చాలా పెద్దలని.. ఆయన వ్యాఖ్యలపై తాను స్పందించనని సోమూ వీర్రాజు పేర్కొన్నారు. ఆయనేదో అన్నారని… తాను అన్నింటికీ స్పందించబోనన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడతానన్నారు. రోడ్ మ్యాప్ పవన్ అడుగుతున్నారని.. దానిని తమ పెద్దలు నిర్ణయిస్తారన్నారు. పవన్‌కు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. బీజేపీ, జనసేన కలిసే ముందుకు వెళతాయన్నారు. చంద్రబాబు, పవన్ కలసినందు వల్ల మీడియా ఎక్కువ కంగారు పడుతోందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.