మునుగోడు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. రోడ్డు రోలర్ గుర్తు మార్పు విషయంలో ఆర్వోపై ఈసీ సీరియస్ అయ్యింది. ఆ గుర్తును ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపల వివరణ ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఈసీఈ ఆదేశించింది. గుర్తుల కేటాయింపులో ఏమాత్రం నిబంధనలు పాటించలేదని ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఏం జరిగిందంటే…
యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ తన గుర్తును మార్చడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తనకు మొదట రోడ్డు రోలర్ గుర్తు ఇచ్చారని, ఆ తర్వాత బేబీ వాకర్ గుర్తు ఇచ్చారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో శివ కుమార్ కు తిరిగి రోడ్డు రోలర్ గుర్తను కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది.