తమిళనాడు కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు కేసుతో హైఅలర్ట్ కొనసాగుతోంది. కారు బాంబు పేలుడు ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం అర్థరాత్రి ఐదుగురు అరెస్ట్‌ను కోయింబత్తుర్ సిపి బాలకృష్ణన్ అధికారికంగా ప్రకటించారు. పేలుడులో మృతి చెందిన మొబిన్ తో సంబంధం ఉన్న ఏడుగురిని విచారించారు. అనంతరం మొహమ్మద్, అసరుద్దీన్, రియాజ్, ఇస్మాయిల్, నవాస్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కోయంబత్తూరు నగరం ఉక్కడంలోని దేవాలయం సమీపంలో కారులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో మొబిన్ (25) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం స్థానిక సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులకు.. మొబిన్ ఇంటి నుంచి మొబిన్‌తోపాటు మరో నలుగురు వ్యక్తులు ఓ బస్తాను బయటికి తీసుకొచ్చిన దృశ్యాలు కనిపించాయి.
తర్వాత వాళ్లు ఆ బస్తాను ఇంటికి కొద్ది దూరంలో ఉన్న కారులో పెట్టడం, అనంతరం ఆ కారులో పేలుడు సంభవించడం జరిగిందని పోలీసులు చెప్పారు. మొబిన్‌తోపాటు ఉన్న ఆ నలుగురు ఎవరు అనే కోణంలో కూడా తమ దర్యాప్తు కొనసాగతున్నదన్నారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు పేర్కొన్నారు. కాగా, ఈ పేలుడులో మరణించిన మొబిన్‌ను 2019లోనే ఎన్‌ఐఏ విచారించినట్లు పోలీసులు ఎంక్వయిరీలో తేలింది. జహ్రాన్ హషీమ్‌కు సంబంధించిన రాడికల్ నెట్‌వర్క్‌తో సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ అతన్ని ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం మొబిన్ ఇంటిలో పోలీసులు సోదా చేయగా పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు, సల్ఫర్ లాంటి నాటు బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాలు లభించాయి.