బల ప్రయోగంతోనైనా సరే.. తైవాన్ ను అంతర్భాగం చేసుకుంటాం : చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

తైవాన్‌ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. శాంతియుత మార్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకొంటున్నామని, అదే సమయంలో బలప్రయోగం ఉండదని హామీ ఇవ్వబోనని తేల్చి చెప్పారు. 2035 నాటికి ఆర్థిక, సైనిక శక్తిలో చైనాను సూపర్‌ పవర్‌గా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 20 నేషనల్‌ కాంగ్రెస్‌లో జిన్‌పింగ్‌ ఆదివారం ప్రారంభోపన్యాసం చేశారు. చైనాను అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధితో ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు.

 

తైవాన్‌ ఎప్పటికైనా చైనాలో కలువాల్సిందేనని జీ జిన్‌పింగ్‌ పునరుద్ఘాటించారు. ‘శాంతియుతంగానే పునరేకీకరణ (చైనాలో తైవాన్‌ను అంతర్భాగం చేయటం) సాధించేందుకు మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. కానీ, ఇందుకోసం బలప్రయోగానికి దిగబోమని మాత్రం హామీ ఇవ్వలేను’ అని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం, తైవాన్‌కు అమెరికా మద్దతు నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ‘కష్టాలు ఎదుర్కోగలిగే తత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి ఆలోచనా విధానంతో శాంతి సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని జిన్ పింగ్ పిలుపునిచ్చారు. పెను గాలులు, మహాఅలలు, కుంభవృష్టిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని జిన్ పింగ్ సూచించారు.

Related Posts

Latest News Updates