వైసీపీపై న్యాయ పోరాటానికి సిద్ధమైన పవన్ కల్యాణ్… వీడియో విడుదల చేసిన జన సేనాని

విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన సంఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఓ వీడియోను విడుదల చేశారు. తమ‌ పోరాటం వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపైనే అని స్పష్టం చేశారు. పోలీసులతో తమకు ఎటువంటి విబేధాలు లేవన్నారు. ఈ గొడవంతా ప్రభుత్వం వల్లేనని.. పోలీసుల నుంచి కాదన్నారు. తన కోసం వచ్చిన అభిమానులకు కూడా అభివాదం చేయకుండా అడ్డుకున్నారని, ప్రభుత్వం అడ్డంకుల వల్ల అభిమానులను కలవలేక పోయానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.15 మంది జనసేన నాయకులపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టారని, కొంతమందికి స్టేషన్ బెయిల్ రాగా, 12మందిని రిమాండుకు పంపారన్నారు. రేపు (మంగళవారం) హైకోర్టులో పిటిషన్ వేసి వారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

న్యాయ పోరాటానికి సిద్ధమైన జనసేనాని

విశాఖ పర్యటనలో ప్రభుత్వం విధించిన ఆంక్షలపై జనసేనాని పవన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి ఆంక్షలు మళ్లీ విధించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించడానికి న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఏం చేయాలని పవన్ కల్యాణ్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇక… పవన్ విశాఖ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. రెండు రోజుల క్రితం విశాఖకు వెళ్లిన పవన్.. పోలీసు ఆంక్షల కారణంగా నోవాటెల్ లోనే వుండిపోయారు. దీంతో నేడు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు.

 

 

 

 

Related Posts

Latest News Updates