ఆర్మీ ఆపరేషన్లలో సైనికులు ఎంత కీలక పాత్ర పోషిస్తారో… వారు శిక్షణ ఇచ్చిన జాగిలాలు కూడా అంతే ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు ఉగ్రవాదులను గుర్తించడంలో జాగిలాలు చాలా ముందు వరుసలో వుంటాయి. తాజాగా… ఓ ఆర్మీ శునకం తన నిబద్ధతను చాటుకొని, విపరీతంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఏకంగా రెండు బుల్లెట్లు తన బాడీలోకి దూసుకెళ్లినా… ఏమాత్రం ఖంగుతినకుండా ఉగ్రవాదుల పీచమణిచింది. ఇద్దరు ఉగ్రవాదుల్ని హత మార్చింది. దక్షిణ కశ్మీర్ లోని తంగపావా ప్రాంతంలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు చిక్కారని సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు తనిఖీలు చేశాయి. ఆ సమయంలోనే తమతో పాటు జూమ్ అనే ఆర్మీ శునకాన్ని కూడా తీసుకెళ్లారు. తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నెరవేర్చింది.
ఉగ్రవాదులు ఎక్కడున్నారో కనుక్కొని.. వారిపై దాడి చేసింది. అప్పుడే ఉగ్రమూకలు దానిని గన్ తో కాల్చారు. జూమ్ శరీరంలోకి రెండు తుపాకీ గుండ్లు దూసుకెళ్లాయి. అయినా.. వెనక్కి తగ్గలేదు. పోరాడుతూనే వుంది. ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోకుండా అడ్డుకుంది. అంతలోనే ఘటనా స్థలికి భద్రతా బలగాలు చేరుకున్నాయి. ఆ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జూమ్ ను ఆర్మీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయాల పాలైన జూమ్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ప్రార్థనలు చేస్తున్నారు.