సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో కోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించిందని మండిపడింది. ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఇవ్వకపోవడంపై సుప్రీం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన విద్యుత్ శాఖ అధికారులకు జైలుశిక్షే ఏకైక పరిష్కారమని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని, రెండు వారాల్లో సుప్రీం నివేదికను అమలు చేయాలని సుప్రీం తేల్చి చెప్పింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈ నెల 31న మరోసారి సమీక్ష చేయనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి కోర్టు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కారు అమలు చేయలేదంటూ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.