ఉక్రెయిన్ కు చెందిన 4 నగరాలు రష్యాలో విలీనమయ్యాయని పుతిన్ ప్రకటించిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ వున్నంత వరకూ తాము రష్యాతో చర్చలు జరపబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత చర్చలకు సిద్ధంగానే వుంటామని అన్నారు. వీలైనంత తొందరగా ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవాలని కూటమిలోని దేశాలను జెలెన్ స్కీ కోరారు. నాటోలో చేరేందుకు తమకు అన్ని అర్హతలున్నాయని, వాటికి ఇప్పటికే నిరూపించుకున్నామని అన్నారు. నాటోలో వీలైనంత తొందరగా చేరేందుకు దరఖాస్తుపై సంతకం చేయడం ద్వారా నిర్ణయాత్మకంగా ముందడుగు వేస్తున్నామని వీడియో సందేశంలో తెలిపారు.
ఉక్రెయిన్ లోని లుహాన్స్క్, దొనెట్క్స్, ఖేర్సన్, జపోరిజియాలను తమ దేశంలో విలీనం చేసేసుకున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ప్రటించారు. ఆ నాలుగు ప్రాంతాల అధినేతలతో కలిసి ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. సంతకాల తర్వాత పుతిన్ తో కలిసి ఆ నలుగురు రష్యా రష్యా… అంటూ నినాదాలు చేశారు. రెఫరెండాన్ని గౌరవించి, ఉక్రెయిన్ ఇప్పటికైనా చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.