టీవీల్లో విద్వేష ప్రసంగాలను అరికట్టడంలో యాంకర్ కీలకం : సుప్రీం కోర్టు

టీవీ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలను అరికట్టడంలో యాంకర్ పాత్ర అత్యంత కీలకమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విద్వేష ప్రసంగాల కారణంగా జరిగిన ఘర్షణలకు సంబంధించి గత ఏడాది నుంచి దాఖలైన అనేక పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వం లోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు దేశంలో టీవీ ఛానళ్ల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన మాధ్యమంగా ఉన్న ఇవి… తరచూ విద్వేష ప్రసంగాలకు వేదికగా మారుతున్నప్పటికీ ఎలాంటి శిక్షలను ఎదుర్కోకుండానే తప్పించుకుంటున్నాయని ఆక్షేపించింది. మనదేశం ఎటువైపు వెళ్తోంది? మీడియా, సోషల్ మీడియాలో చాలా విద్వేష పూరిత ప్రసంగాలు వస్తున్నాయి. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోతోంది.టీవీ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలను అరికట్టడంలో టీవీ యాంకర్లకు పెద్ద బాధ్యత ఉంటుంది అని స్పష్టం చేసింది.

 

చర్చల్లో టీవీ యాంకర్లు అతిథికి కూడా సమయం ఇవ్వరు. మీడియా స్వేచ్ఛ ముఖ్యమైనదే కానీ, దానికి ఓ లక్ష్మణ రేఖ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అతిథులు ఆ గీతను దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాంకర్లదే. విద్వేషాన్ని సమాజంలోకి వదిలేయకూడదు అని కోర్టు వ్యాఖ్యానించింది. విద్వేష ప్రసంగాల నుంచి రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారని, అందుకని టీవీ ఛానళ్లు వేదికగా మారుతున్నాయని ధర్మాసనం ఆగ్రహించింది. వీటిపై కఠినమైన నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే ప్రభుత్వం వీటిపై వ్యతిరేక వైఖరి తీసుకోకూడదని, కానీ కోర్టుకు సహకరించాలని సూచించింది.

Related Posts