భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద ఫ్యాన్స్ ఎగబడ్డారు. అంచనాలకు మించి అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలో పోలీసులకు,క్రికెట్ అభిమానులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ తొక్కిసలాటలో 4 గురు పోలీసులు, 10 మంది అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు. చెప్పులు చెల్లాచెదురుగా అక్కడే పడిపోయాయి. ఈ తోపులాటలో కొంత మంది కిందపడిపోవడం, తోపులాట జరగడంతో ఊపిరాడకుండా పోయింది.
అయితే… ఓ మహిళ చనిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను పోలీసులు ఖండించారు. మహిళకు యశోదలో చికిత్స జరుగుతోందని నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ ప్రకటించారు. కాగా భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో మూడు వేలు మాత్రమే ఇస్తారని ప్రచారం జరిగింది. దీంతో టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్స్‌కు తరలివచ్చారు. దాదాపు 30వేల మందికిపైగా అభిమానులు అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంచనాలకు మించిన క్రికెట్ అభిమానులు తరలిరావడంతో… తొక్కిసలాట జరుగగా… చివరకు పోలీసులు వారిని అదుపుచేసేందుకు లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.