దుర్గామాత యొక్కఅనేక స్వరూపమునకు మహాగౌరి అని పేరు.
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవప్రమోదదా.
ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును. ఈమె అష్టవర్షప్రాయముగలది అష్టవర్షాభవేద్గౌరీ ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళకాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన, ఈమె తన కుడిచేతులలో ఒక దానియందు అభయముద్రను మరోకదానియందు త్రిశూలమును ధరించియుండును.
అట్లే ఎడమ చేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొక దానియందు వరముద్రను కలిగియుండును. ఈ ముద్రలలో ఈమె దర్శనము ప్రశాంతముగా నుండును. పార్వతి యవతారమునందు ఈమె పరమేశ్వరుని పతిగాబడయుటకు కఠోరమైన తపస్సును ఆచరించెను. వ్రియ్కేహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము). అనునది ఈమె ప్రతిజ్ఞ.
ఇట్టి కఠోర తపస్సు కారణమున ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరమును గంగాజలములచే ప్రక్షాళిత మొనర్చెను. తత్ప్రభావమున ఈమె శ్వేతవర్ణశోభితయై విద్యుత్‌కాంతులను విరజిమ్మెను. అప్పటినుండి ఈమె మహాగౌరి అని వాసిగాంచెను.
దుర్గానవరాత్రోత్సవములలో మహాగౌరి ఉపాసన విధ్యుక్తముగా నిర్వహింపబడుచుండును. ఈమె శక్తి అమోఘము సద్యఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగుచుండును. వారి పూర్వసంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులోగూడ పాపతాపములుగాని, దైన్యదుఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, అక్షయముగా పుణ్యఫలములను పొందుదురు.!!
మీ
నందగోపాలవంశీకృష్ణశర్మ బిదురు