దసరా పండగ ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రస్తుతం వున్న 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ఈ రిజర్వేషన్లు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టియానా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి, గిరిజనులు అధికంగా వున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. అయితే.. రిజర్వేషన్లు పెంచాలంటూ చెల్లప్ప కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.