మార్క్ జుకెర్బర్గ్కు చెందిన ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు రష్యా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా నిలుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం సంచలనం రేపుతోంది. కొన్ని రోజుల క్రిందటే రష్యా కోర్టు ఫేస్ బుక్, ఇన్ స్టాను దేశంలో నిషేధించింది. రష్యాకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను పెట్టేలా ఉక్రెయిన్ ప్రజలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అనుమతిస్తున్నట్టు మాస్కో కోర్టు కూడా ఆరోపించింది. రష్యా ఆరోపణలను మెటా తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. రష్యాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కోర్టుకు తెలిపారు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లు గత మార్చి నుండి రష్యాలో అందుబాటులో లేకపోయినా చాలా మంది రష్యన్లు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను ఉపయోగించడం కొనసాగించడానికి విపిఎన్ లను ఉపయోగించుకొంటున్నారు. ఇన్స్టాగ్రామ్ రష్యాలో ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రకటనలు, విక్రయాలకు ముఖ్యమైన వేదికగా పేరొందింది. ఫిబ్రవరి 24న రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించినప్పటి నుండి, క్రెమ్లిన్ సోషల్ మీడియాపై తన నియంత్రణను కఠినతరం చేసింది. రష్యన్లపై హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ పాశ్చాత్య సోషల్ మీడియా దిగ్గజాలను నిషేధించింది.