అధ్యక్షునిగా ఎవరు ఎన్నికైనా.. వారికి ‘ఫ్రీ హ్యాండ్ ‘వుంటుంది : రాహుల్ ప్రకటన

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా.. వారికి ఫ్రీహ్యాండ్ వుంటుందని, వారు పూర్తి స్వతంత్రంగా పనిచేసే వాతావరణం పార్టీలో వుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుతం పోటీలో మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ వున్నారని, ఇద్దరికీ సొంత దృక్పథాలు వున్నాయని అన్నారు. వారికి రిమోట్ కంట్రోల్ అన్న పదం వారికి ఆపాదిస్తే.. అవమానించినట్లే అవుతుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ తలపెట్టిన భారత్ జోడోయాత్ర కర్నాటకలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కాంగ్రెస్ ఫాసిస్టు పార్టీ కాదని, చర్చలను భిన్న దృక్పథాలను స్వాగతిస్తామని అన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే.. ఓ జట్టుగా పనిచేసే గుణమే తమ నేతలకు తెలుసని అన్నారు.

 

 

పీఎఫ్ఐపై కేంద్రం బ్యాన్ విధించడాన్ని కూడా రాహుల్ ప్రస్తావించారు. ద్వేషం ఎక్కడి నుంచి వచ్చినా, ఏ వ్యక్తి వ్యాప్తి చేసినా తప్పే అన్నారు. ద్వేషాన్ని తాము వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. వారికి వ్యతిరేకంగానే తాము పోరాడతామన్నారు. కాంగ్రెస్ నేతలు స్వాతంత్ర్య పోరాటంలో భాగం పంచుకున్నారని, బీజేపీ నేతలు ఎక్కడా లేరన్నారు. కొన్ని రోజుల క్రితం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగానే ఎప్పుడూ పోరాటం చేస్తుంటామని, తనపై తప్పుడు ప్రచారాలు చేయడానికి బీజేపీ కొన్ని లక్షలు వెచ్చిస్తోందని ఆరోపించారు. బీజేపీ దగ్గర బాగా డబ్బులున్నాయని, ధనవంతమైన పార్టీ అని, అందుకే ఈ దుష్ప్రచారం ఇంకా సాగుతోందని రాహుల్ మండిపడ్డారు.

Related Posts

Latest News Updates