షింజో అబేకు ఘనంగా నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ఘనంగా నివాళులర్పించారు. టోక్యోలో జరిగిన అబే అంత్యక్రియల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆయనతో పాటు 100 దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. భారత్, జపాన్ మైత్రిని మరింత బలోపేతం చేయడంలో షింజో కీలక పాత్ర పోషించారని, భారత్ కు ఆత్మీయ మిత్రుడు అని మోదీ పేర్కొన్నారు. అబే మరణం విషాదకరమని, తనకు వ్యక్తిగతంగా లోటన్నారు. గతంలో జపాన్ కు వచ్చినప్పుడు చాలా సమయం మాట్లాడుకున్నామని మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ప్రధాని కిషిద సైతం అబే బాటలోనే నడుస్తారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. పలు అంశాలపై వీరిద్దరూ చర్చలు జరిపారు. అబే అంత్యక్రియల కోసం జపాన్ కు వచ్చిన మోదీకి కిషిద ధన్యవాదాలు ప్రకటించారు.

 

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే(67) జులై 8, 2022న దారుణ హత్యకు గురయ్యారు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌కు నమ్మకమైన మిత్రుడిగా వ్యవహరించిన షింజో ఓ మాజీ సైనికుడి తూటాలకు బలయ్యారు. దక్షిణ జపాన్‌లోని నారా నగరంలో రైల్వే స్టేషన్‌ వెలుపల ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ ఘోరం జరిగింది. వెనుక నుంచి వచ్చిన మాజీ సైనికుడు నాటు తుపాకితో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పిడికిలి పైకెత్తి మాట్లాడుతున్న షింజో అబే మెడలో ఒక తూటా, గుండెలో మరో తూటా వెంట వెంటనే దూసుకుపోయాయి.

 

 

Related Posts

Latest News Updates