ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభమైంది. ఈ పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్టుకు చేరుకోగానే.. గుజరాత్ సీఎం, అధికారులు ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకిరువైపులా నిల్చున్న ప్రజలు.. పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఆ తర్వాత సూరత్ లో 3,400 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… గుజరాత్ లోని తీరప్రాంతాలను అభివృద్ధి చేశామని తెలిపారు. గుజరాత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
బొగ్గు టెర్మినల్స్ యొక్క నెట్ వర్క్ ను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమల అవసరాలను తీర్చామని పీఎం అన్నారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలకు మెటల్ స్క్రాపింగ్ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. కొత్త వెహికల్ స్క్రాపింగ్ పాలసీ దేశంలో వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగుపరుస్తుంది. భావ్‌నగర్ కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు మెటల్ స్క్రాపింగ్ కేంద్రంగా ఉద్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్ లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… ఇళ్ల నిర్మాణం వేగవంతమైందన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో ఇప్పటి వరకు దాదాపు 4 కోట్ల మంది పేద రోగులకు ఉచిత వైద్యం అందించామని తెలిపారు.