భారతీయ సంప్రదాయ నృత్యం ఆధారంగా రూపొందిన నాట్యం సినిమా ద్వారా కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు గత ఏడాది సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆమె ‘నాట్యం’ సినిమాను చేయబోతున్నట్లు అనౌన్స్ చేసి అందరిలోనూ ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. అలాగే నాటం సినిమా విడుదల తర్వాత విభిన్న చిత్రంగా అందరి మన్ననలు అందుకోవటమే కాదు.. ప్రతిష్టాత్మకమైన 68వ జాతీయ సినీ అవార్డులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం న్యూ ఢిల్లీలో జరిగిన జాతీయ చలన చిత్రోత్సవ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సంధ్యారాజు నాట్యం చిత్రానికిగానూ బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో అవార్డును అందుకున్నారు. సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్ ప్రధాన పాత్రధారులుగా నాట్యం సినిమా రూపొందింది. డాన్స్ ప్రధానంగా సాగే కథాంశం కావటంతో సినిమాకు నాట్యం అనే టైటిల్‌ను పెట్టారు. సినిమాను ఎంతో ఆసక్తికరంగా.. ఆకర్షణీయంగా చిత్రీకరించారు. క్లాసిక్ డాన్సర్ పాత్రలో సంధ్యా రాజు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. గురువు, శిష్యుడు మధ్య ఉండే గొప్ప అనుబంధాన్ని తెలియజేస్తూనే మెప్పించే ప్రేమకథా చిత్రంగా నాట్యం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.