పాక్ లోని మైనారిటీల విషయంలో అక్కడి ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తీవ్రంగా మండిపడ్డారు. మైనారిటీలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో వున్న పాక్.. అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలివ్వడం మాని… తన ఇంటిని చక్కదిద్దుకోవాలని మీనాక్షి లేఖి హితవు పలికారు. కజకిస్తాన్ వేదికగా జరుగుతున్న సీఐసీఏ సదస్సులో ఆమె కీలక ప్రసంగం చేశారు. పాక్ లో మైనారిటీలను ఓ క్రమ పద్ధతిలో హింసిస్తున్నారని మండిపడ్డారు. తరుచుగా మైనారిటీ ప్రార్థనా స్థలాలపై దాడులు, విధ్వంసం జరుగుతున్నాయని, లెక్కలేనన్ని బాలికల అపహరణ కేసులు, బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని, ఇదంతా పాక్ దుర్బల పరిస్థితికి ప్రత్యక్ష తార్కాణమని అన్నారు.
ప్రపంచంలోనే ఉగ్రవాదానికి పాక్ కేంద్ర బిందువు అని, జమ్మూ కశ్మీర్ పై వ్యాఖ్యానించడానికి పాక్ కు అధికారమే లేదని తేల్చి చెప్పారు. 1999 నాటి సీఐసీఏ సభ్య దేశాల మధ్య కుదిరిన డిక్లరేషన్ కు విరుద్ధంగా పాక్ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ, భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. ప్రపంచ దృష్టి మరల్చడానికి సీఐసీఏ వేదికను పాక్ ఎంచుకోవడం అత్యంత దురదృష్టకరమని లేఖీ అన్నారు.