జీవుడు – ఉత్తమ కర్మ

మూసిన కన్ను తెరవకపోయినా తెరిచిన కన్ను మూయకపోయినా శ్వాస తీసుకుని వదలకపోయినా వదిలిన శ్వాస తీయకపోయినా ఈ లోకంలో, ఈ జన్మకు అదే చివరి చూపు. మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచిపోయేలా చేస్తుంది కాలం.
విరోధులు స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరలా కనిపించం.
ఫెయిర్ అండ్ లవ్లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు. ఈ క్షణం మాత్రమే నీది. మరుక్షణం ఏవరిదో? ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు.
ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా, బలవంతులైనా అవయవక్షీణం, ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు.
ఈ సృష్టిలో మనము మొదలు కాదు. చివర కాదు. ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకువెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు. చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం మనకి లేదు. ఈ భూమ్మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం.
మనం సహ ప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ. అశాశ్వతమైనవి శాశ్వతమనే మాయను భక్తితో ఛేధిద్దాం. అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం భక్తిమార్గం. అందుకే మనుషుల్లా జీవిద్దాం. మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం.
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు

Related Posts

Latest News Updates