ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12 విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఆయన వాటిని బదిలీ చేశారు. దాదాపు 16 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరాయి. మధ్యవర్తులు, కమీషన్ల ఏజెంట్ల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే బదిలీ చేస్తున్నామని మోదీ వివరించారు. 2వ విడత నిధులు దీపావళి పండుగకు ముందే రైతులకు చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పిఎం–కిసాన్) కింద అర్హులైన రైతులకు ప్రతి మూడు నెలలకు రూ. 2,000 చొప్పున ఏడాదికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్రం అందచేస్తోంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ డబ్బు జమ అవుతుంది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభం కాగా 2018 డిసెంబర్ నుంచే ఇది అమలులోకి వచ్చింది. దేశ రాజధానిలోని పూసా క్యాంపస్‌లో జరుగుతున్న రెండు రోజుల పిఎం– కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022లో ప్రధాని నరేంద్ర మోడీ 12వ విడత మొత్తాన్ని విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన కింద “వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్” అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అన్ని సబ్సిడీ ఎరువులను ఒకే బ్రాండ్ కింద మార్కెట్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మేళన్ 2022 సందర్భంగా జరుగుతున్న రెండు రోజుల కార్యక్రమంలో సింగిల్ బ్రాండ్ భారత్ పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు.
సబ్సిడీ ఎరువుల అక్రమ మార్గంలో తరలింపుకు చెక్ పెట్టేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం కింద యూరియా, డి అమ్మోనియా ఫాస్ఫేట్ (డీఎపీ), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఒపి), ఎన్‌పికే వంటివి ఒకే బ్రాండ్ కింద విక్రయాలు జరుగుతాయి. అంతేకాక సుమారు 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను (పీఎంకేఎస్‌కే) కూడా ప్రారంభించారు. ఇవి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు అందించడమే కాకుండా బహుళ సేవలను అందించే ఒక షాపుగా పనిచేస్తుంది.
దేశంలో దాదాపు 3.5 లక్షలకు పైగా ఉన్న రిటైల్ దుకాణాలను పీఎంకేఎస్‌కేగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ఈ కేంద్రాలలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు వంటివి అందించడమే కాకుండా మట్టి, విత్తనాలు, ఎరువులకు సంబంధించిన పరీక్ష సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.