కేరళలోని కాసర్‌గాడ్ జిల్లా అనంతపురలో కొలువైన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ కొలనులో ‘శాకాహార’ మొసలి మరణించింది. ఈ మొసలి పూర్తిగా శాకాహారి. ఓ మొసలి శాకాహారం తీసుకోవడం అనేది ప్రత్యేకం. బాబియా కేవలం భక్తులు పెట్టే ప్రసాదాన్ని మాత్రమే తింటుంది. ఆలయంలో అన్నం, బెల్లంతో తయారు చేసిన దేవుడి ప్రసాదమే ఆహారంగా తీసుకుంటుంది. ఎవరికీ ఏ హాని తలపెట్టని బాబియా సుమారు 70 ఏళ్లుగా ఆ కొలనులో ఒంటరిగానే ఉంటోంది. అయితే.. ఈ మొసలిని భక్తులందరూ బాబియా అని పిలుచుకుంటారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మొసలి అనంత పద్మనాభ స్వామి ఆలయం చెరువు మధ్యలో వుండేది.
అయితే… ఈ ఆలయం చెరువులోకి ఈ మొసలి ఎలా వచ్చిందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. పైగా బాబియా అని పేరు ఎలా వచ్చిందో కూడాతెలియదు. ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించలేదని, తటాకంలోని చేపలను కూడా ఎప్పుడూ తినలేదని అక్కడి వారు చెబుతుంటారు. ఆలయ ప్రధాన అర్చకులు రోజూ ఆ మొసలికి 2 సార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఆలయంలో స్వామి వారికి నివేదించే అన్నం, బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్నే మొసలి స్వీకరిస్తుంది. అయితే.. ఈ మొసలి శనివారం నుంచి కనిపించకుండా పోయింది. చివరికి ఆదివారం అర్ధరాత్రి బాబియా కళేబరం కొలనులో తేలుతూ కనిపించింది.