కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పై సీఎం పినరయ్ మండిపడ్డారు. తొమ్మిది మంది వీసీలు రాజీనామా చేయాలని ఆదేశించే అధికారం ఆయనకు లేదని సీఎం పినరయ్ స్పష్టం చేశారు. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, గవర్నర్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లడం కాదన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో యూనివర్శిటీలను నాశనంచేసే ఉద్దేశంతోనే ప్రభుత్వంతో గొడవకు దిగుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై దురాక్రమణే అవుతుందన్నారు. ఆ తొమ్మిది యూనివర్శిటీల వీసీలను నియమించింది గవర్నరే అని గుర్తు చేశారు. ఛాన్సలర్ గా వున్న వ్యక్తికి వీసీల రాజీనామా కోరే అధికారం లేదని సీఎం పినరయ్ స్పష్టం చేశారు.
కేరళలోని 9 యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశించారు. సోమవారం ఉదయం 11.30 లోపు రాజీనామా పత్రాలు తనకు అందాలని స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్ స్వయంగా ఆదివారం చేసిన ట్వీట్ కలకలం రేపింది. గవర్నర్ చేసిన ట్వీట్‌లో అక్టోబర్ 24లో ఉదయం 11.30 లోపు రాజీనామాలు చేయాలని కేరళలోని తొమ్మిది యూనివర్శిటీల వైస్‌ఛాన్సలర్లకు లేఖలను ఇామెయిల్ ద్వారా పంపినట్లు పేర్కొన్నారు.
కేరళ యూనివర్శిటీ, ఎంజి యూనివర్శిటీ, కొచిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఒషన్ స్టడీస్, ఎపిజె అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్శిటీ, శ్రీ శంకరాచార్య సంస్కృత్ యూనివర్శిటీ, కాలికుట్ యూనివర్శిటీ, తుంచత్ ఎజుథచన్ మలయాళం యూనివర్శిటీ, కన్నూర్ యూనివర్శిటీల విసిలకు గవర్నర్ ఈ మేరకు లేఖలు పంపారు.