భారత సంతతికి చెందిన రుషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు ఆయన చరిత్రనే నెలకొల్పారు. లిజ్ ట్రస్ రాజీనామాతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధానిగా మెజారిటీ పార్లమెంటు సభ్యుల (188 మంది) మద్దతు లభించడంతో ఆయనను ప్రధానిగా, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ప్రకటించారు. కనీసం 30 మంది కూడా ఎంపీల మద్దతు లేకపోవడంతో రిషి ప్రత్యర్ధి పెన్నీ మోర్డాంట్ చివర్లో పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఏకగ్రీవంగా రిషికి ప్రధాని పదవి ఖరారైంది. రిషికి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి తీవ్ర పోటీ ఎదురతుందని గతవారం భావించినప్పటికీ.. ఆయన అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్నారు. దీంతో రిషి సునాక్ ప్రధాని అయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ ఎన్నికలో బ్రిటన్ మాజీ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ సైతం రిషి సునాక్ కే మద్దతు ప్రకటించడం విశేషం.
ప్రస్తుత పరిస్థితుల్లో రిషిఅయితేనే దేశాన్నిసంక్షోభం నుంచిగట్టెక్కించగలరని టోరీ సభ్యులు విశ్వసించారు. దీంతో బ్రిటన్ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్ కి వచ్చింది. నెలన్నర రోజుల క్రితంత లిజ్ ట్రస్ చేతిలో ఓటమి పాలైన అదే సునాక్… నేడు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం రిషి సునాక్ వయస్సు కేవలం 42 సంవత్సరాలే. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. ఈ పదవి చేపట్టిన మొదటి భారత సంతతి వ్యక్తిగా, తొలి హిందువుగా నిలిచారు. అలాగే తొలి శ్వేత జాతీయేతర ప్రధానిగా కూడా గుర్తింపు పొందారు. నిజానికి రిషి 2014 లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్ మాండ్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. 2020 లో బోరిస్ ప్రధానిగా అయిన తర్వాత ఆయన కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా సేవలందించారు. కరోనా సంక్షోభంలో వ్యాపారులు, కార్మికుల కోసం వంద కోట్ల పౌండ్ల ప్యాకేజీ తీసుకొచ్చి.. మంచి గుర్తింపు పొందారు.