సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కేదార్ నాథ్ దేవాలయ పూజారులు రాత్రి పూట కూడా దేవాలయం ముందు వుంటున్నారు. దేవాలయానికి బంగారు తాపడం వేయడాన్ని కొందరు పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బంగారు పూత పూయడం కోసం ఉపయోగించే డ్రిల్లింగ్ యంత్రాల వల్ల దేవాలయం దెబ్బతింటుందని ఓ వర్గం అర్చకులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే… కేదార్ నాథ్ దేవాలయ కమిటీ మాత్రం బంగారు తాపడం వేయడాన్ని అంగీకరించింది. రాత్రి పూట కమిటీ వారు బంగారు తాపడం వేస్తారన్న భయంతో కొందరు అర్చకులు రాత్రి వేళల్లో కూడా దేవాలయం బయటే కూర్చుంటున్నారు.
మహారాష్ట్రకు చెందిన ఓ శివ భక్తుడు కేదార్‌నాథ్ దేవాలయానికి బంగారు పూత పూయించడానికి ముందుకు వచ్చారు. ఆయన ప్రతిపాదనను బదరీనాథ్-కేదార్‌నాథ్ దేవాలయాల కమిటీ అంగీకరించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి తీసుకుంది. ఈ నేపథ్యంలో దేవాలయం గోడలకు తాపడం చేసిన వెండి రేకులను తొలగించి, బంగారు రేకులను తాపడం చేయాలని నిర్ణయించడాన్ని తీర్థ పురోహితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీర్థ పురోహితుడు సంతోష్ త్రివేది మాట్లాడుతూ, బంగారు రేకుల తాపడం వల్ల దేవాలయం గోడలు దెబ్బతింటాయన్నారు. ఈ పనుల కోసం పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మెషీన్స్‌ను వాడుతున్నారన్నారు. దేవాలయంలో శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని తారుమారు చేయడాన్ని తాము సహించలేమన్నారు.
అయితే…. ట్రస్ట్ మాత్రం మరో రకంగా వాదిస్తోంది. బంగారు పూతను వ్యతిరేకించడం సమర్థనీయం కాదంటోంది. అసలు నిర్మాణానికి విఘాతం కలగకుండా, సంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపింది. దేవాలయాన్ని ఆధునికీకరించడం, సుందరీకరణ చేయడం సాధారణ విషయమేనని ట్రస్ట్ సభ్యుడు పేర్కొన్నారు. వేళ్ళమీద లెక్కబెట్టగలిగినంత మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, వారికి ప్రాతినిధ్యంవహిస్తున్న సంఘాలు ఆ పని చేయడం లేదని తెలిపారు.