కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా నటించి ఆయన రచన, దర్శకత్వం వహించిన ‘కాంతార’.. సెప్టెంబర్ 30న కర్ణాటకలో విడుదలై అఖండ విజయం సాధించింది. కొన్ని సినిమాలపై అంచనాలు ఏమీ ఉండవు. అసలు అలాంటి ఒక సినిమా విడుదలవుతుందని కూడా పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ, ఆ సినిమాలు అనూహ్యంగా ఆదరణ పొందుతాయి. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. తెలుగులో అలాంటి సినిమాలు ఇప్పటి వరకు చాలానే వచ్చాయి. అయితే, ఒక కన్నడ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం కర్ణాటకలోనే కాకుండా ఇప్పుడు తెలుగులో అనువాదమై ఇక్కడ కూడా ఆశ్చర్యపరుస్తోంది. అదే ‘కాంతార’.కన్నడ సినిమా ‘కాంతార’.. కేవలం కర్ణాటకలోనే కాకుండా దేశ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా కన్నడ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. ముఖ్యంగా సినిమా ఆఖరి అరగంట వేరే స్థాయిలో ఉంది. హీరో రిషబ్ శెట్టి నటన ప్రధాన ఆకర్షణ. ‘కాంతార’కు కన్నడ నాట విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురవడంతో ఈ సినిమాను ఇతర భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్‌ను రూపొందించి ఇండియాలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన హోంబలే ఫిలింస్ ‘కాంతార’ను నిర్మించింది. ఈ సినిమాను కన్నడలో చూసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను కొనుగోలు చేశారు. రూ.2 కోట్లకు అనువాద హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం. గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా శనివారం ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. అయితే, పెద్దగా ప్రమోషన్ మాత్రం చేయలేదు. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ములేపింది. తొలిరోజే రూ.2.1 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అంటే ఒక్కరోజులోనే రావాల్సిన మొత్తాన్ని లాగేసింది. ఇక ఈరోజు ఆదివారం కావడంతో మరో రూ.2 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలోనూ ‘కాంతార’ కలెక్షన్స్ ఆకట్టుకుంటున్నాయి. హిందీ వెర్షన్ శుక్రవారం విడుదలైంది. తొలిరోజు ఈ సినిమా నార్త్‌లో రూ.1.3 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. నిజానికి నార్త్‌లో ‘కాంతార’కు పెద్దగా థియేటర్లు ఇవ్వలేదట. తొలిరోజు మంచి కలెక్షన్లు రావడంతో థియేటర్ల సంఖ్యను పెంచారు. దీంతో శనివారం హిందీ వెర్షన్ కలెక్షన్స్ అనూహ్యంగా పెరిగాయి. రెండో రోజు హిందీలో ‘కాంతార’ సుమారుగా రూ.2.25 కోట్ల నెట్ వసూలు చేసింది. అంటే, హిందీలోనూ ఈ సినిమా రెండు రోజుల్లో సుమారు రూ.3.5 కోట్లు రాబట్టింది. ‘కాంతార’ హిందీ అనువాద చిత్రానికి ప్రధానంగా మహారాష్ట్ర నుంచి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. మిగిలిన నార్త్ సర్క్యూట్స్‌లో కాస్త తక్కువగా ఉన్నాయి. కర్ణాటకలోని కంబ్లా, భూతకోలా సాంప్రదాయం, సంస్కృతిని తెలియజెప్పే యాక్షన్ థ్రిల్లర్ ‘కాంతార’. రిషబ్ శెట్టి కెరీర్లోనే ఇది గొప్ప చిత్రమని అంతా అంటున్నారు. ఈ సినిమాలో కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, నవీన్ డి పాడిల్ తదితరులు నటించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు.