బెంగళూరును మరోసారి భారీ వర్షాలు ఘోరంగా దెబ్బతీశాయి. ఐటీ సెక్టార్ సిలికాన్ వ్యాలీ కూడా వర్షాలకు ఘోరంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా బెంగళూరులోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా వుందని అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో కురిసిన వర్షానికి రోడ్లన్నీ స్విమ్మింగ్ పూల్స్ లాగే మారిపోయాయి. చాలా కార్లు ధ్వంసమయ్యాయి. వర్షం ధాటికి పార్క్ చేసిన కార్లపై చెట్లు పడిపోయాయి. దీంతో ధ్వంసమయ్యాయని వాపోతున్నారు. అంతేకాకుండా రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
అపార్ట్ మెంట్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు 3 రోజుల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. దీంతో అక్కడ ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. గరిష్టంగా రాజమహల్ గుట్టహల్లిలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత నెలలోనే బెంగళూరులో విపరీతమైన వర్షాలు కురిశాయి. అప్పుడే నగరం బాగా దెబ్బతింది. తాజాగా.. మళ్లీ భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలు నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.