నాలుగున్నరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కారు డ్రైవర్ బీమన రజనీ కుమార్ (34), డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి (55) ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత చంచల్ గూడకు రిమాండ్ నిమిత్తం పంపారు. ఈ విషయాన్ని బంజారాహిల్స్ ఏపీసీ సుదర్శన్ ప్రకటించారు. బాలికను ప్రిన్సిపాల్ మాధవి డ్రైవర్ రజనీ కుమార్ రెండు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేశాడని, ఆ బాలికను స్కూల్ లోని డిజిటల్ రూపంలోకి తీసుకెళ్లి, అత్యాచారం చేశాడని తెలిపారు. వీటికి సంబంధించిన ఆధారాలను, సీసీ ఫుటేజీలను తాము సేకరించినట్లు వెల్లడించారు. అయితే… ఈ విషయంలో ప్రిన్సిపాల్‌ మాధవి నిర్లక్ష్యం ఉందని, అందువల్లే ఈ ఘటన జరిగిందన్నారు. మాధవిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి, అరెస్టు చేశామని ఏసీపీ సుదర్శన్‌ వివరించారు.

 

మరోవైపు నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన డ్రైవర్ రజనీ కుమార్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు, వివిధ విద్యార్థి సంఘాల నేతలు బంజారాహిల్స్ పీఎస్ ముందు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. పోలీసులకు, పాఠశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారందరూ డిమాండ్ చేశారు. ఇదంతా డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవికి తెలిసే జరుగుతోందని, అయినా చూసీ చూడనట్లు వ్యవహరించారని వారు ఆరోపించారు. వెంటనే డీఏవీ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.