మావోయిస్టులతో లింకులున్నాయన్న కేసులో శిక్షను అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అని బాంబే హైకోర్టు ప్రకటించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్టు సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయన్ను వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది. తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017 లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జీఎన్ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్ ను జస్టిస్ రోహిత్ డియో, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ నేడు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఆయన నిర్దోషి అని ప్రకటించింది. ఆయన్ను వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని కూడా ఈ కేసులో న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. మరేదైనా కేసులో వీరు నిందితులుగా వుంటే తప్ప… వీరందరినీ తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయని 2014 లో సాయిబాబాతో సహా ఓ జర్నలిస్టు, జేఎన్ యూ విద్యార్థి సహా మరికొందర్ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2017 లో సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి నాగపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.