ఇతర దేశాలు 5జీ సేవలను కోరుకుంటే.. తప్పకుండా అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 5జీని తమ సొంత టెక్నాలజీతో రూపొందించామని వాషింగ్టన్ వేదికగా సీతారామన్ ప్రకటించారు. 5జీ సేవలు కావాలని ఇప్పటికే పలు దేశాలు తమను సంప్రదిస్తున్నాయని, ఇది భారత్ కు చాలా గర్వకారణమని అన్నారు. 2024 వరకు 5జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని పేర్కొన్నారు. 5జీ సర్వీసులతో టెలీకమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి అన్నారు. సమాచార రంగంలో మరిన్ని సేలు అందుబాటులోకి వస్తాయని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ రంగంలో భారత్ ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పుతుందని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఆర్ధిక వ్యవస్థను డిజిటలైజేషన్ బాట పట్టించడం జరిగిందన్నారు. ఆ సమయంలో ఎన్నో ప్రారంభ అడ్డంకులు ఎదురైనప్పటికీ… క్రమంగా వాటిని భారత్ అధిగమించిందన్నారు. ప్రస్తుతం దేశం డిజిటల్ భారత్ గా మారిందని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి డిజిటల్ నెట్ వర్కింగ్ ను బలోపేతం చేయటమే కాకుండా…విద్య,వైద్యం, ఆర్ధిక లావాదేవీలన్నీటిని డిజిటల్ విధానంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.