లైగర్ సినిమా నష్టాల దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారట. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో నష్టపోయారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు వీరంతా కూడా పూరి కనెక్ట్స్ ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఛార్మీని కలిసి తమ నష్టాల గురించి చెబుదామంటే అందుబాటులోకి రావడం లేదట. ఇక ఈ సమస్య ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తీసుకెళ్లాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో భారీ అంచనాల నడుమ సినిమాలు విడుదలవ్వడం, అవి కాస్తా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోతోన్నారు. ఆచార్య సినిమా విషయంలోనూ డిస్ట్రిబ్యూటర్లకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇక అందరూ కట్టకట్టుకుని కొరటాల శివ ఆఫీస్ ఎదుటకు ధర్నా దిగిన సంగతి తెలిసిందే. అలా రచ్చ రచ్చ చేయడంతో సీడెడ్ డిస్ట్రిబ్యూటర్లకు కొరటాల శివ కొంత మొత్తానికి రిటర్న్ చేశాడు. ఇప్పుడు లైగర్ డిస్ట్రిబ్యూటర్లకు ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు చాలా ఏరియాల్లో భారీ స్థాయిలో నష్టపోయారట. వీరంతా కూడా ఛార్మీ, పూరిలను కలిసి తమ నష్టాలను ఎంతో కొంత పూడ్చమని అడిగేందుకు ప్రయత్నిస్తున్నారట. కానీ ఛార్మీ మాత్రం మొండి చేయి చూపిస్తోందట. మేం కూడా ఎంతో లాస్ అయ్యాం.. మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలన్నట్టుగా అనేస్తోందట. అయితే కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కనీసం ఛార్మీతో మాట్లాడేందుకు కూడా లైన్ దొరకడం లేదట. వీరంతా కూడా ఈ ఇష్యూని ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. అయితే తమకు రావాల్సిన మొత్తాన్ని, వడ్డీలను చెల్లించిన తరువాత నెక్ట్స్ సినిమాను చూసుకోండనే ఒత్తిడిని తీసుకురావాలని అనుకుంటున్నారట. మరి వీరి ప్రయత్నం ఎంత వరకు సఫలం అవుతుందో చూడాలి. అయితే గత కొన్ని రోజులు క్రితం విజయ్ తిరిగి ఇచ్చిన మొత్తం మీద రకరకాల వార్తలు వచ్చాయి. లైగర్ సినిమా దెబ్బేయడంతో.. పూరి, ఛార్మీలకు విజయ్ ఆరు కోట్లు తిరిగి ఇచ్చాడనే కథనాలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. జన గణ మన సినిమా మీద కూడా విజయ్ పూరి పునరాలోచనలో పడ్డారనే టాక్ కూడా వినిపిస్తోంది.