నేడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు పార్టీ ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ప్రకటించారు. శవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. పార్టీలోని 9 వేల మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) డెలిగేట్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.దేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కార్యాలయంలో, భారత్ జోడో యాత్ర క్యాంప్ లో కూడా పోలింగ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ అక్కడే ఓటేస్తారని పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఇక.. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోనే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక… రాహుల్ యాత్రలో పాల్గొంటున్న ఏపీ కాంగ్రెస్ నేతలు తమ ఓటు హక్కును కర్నూలులో వినియోగించుకోనున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తైనట్లు నేతలు తెలిపారు. 137 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించడం ఇది ఆరోసారి.
ఓటర్లందరికి ‘క్యూ ఆర్’ కోడ్‌తో కూడిన ఓటరు గుర్తింపుకార్డు అందజేశారు. ఓటు వేసేవారు తప్పకుండా ఓటింగ్ గుర్తింపుకార్డుతో వెళ్లాల్సి ఉంది. తొలుత వారి పేరు, ఊరు, పార్టీలో బాధ్యత తదితర వివరాలు నమోదుచేస్తారు. అనంతరం వారికి బ్యాలెట్ పేపరు అందజేయనున్నారు. బ్యాలెట్ పేపర్‌లో మొదటి పేరుగా మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పేరు ఆంగ్లం, హిందీ భాషల్లో ముద్రించారు. ఆ తర్వాత రెండవదిగా శశిథరూర్ పేరు చోటుచేసుకుంది. బ్యాలెట్ పేపర్లో ఏ రాష్ట్రం, ఓటరు నెం, వరుస నెం, స్థలం తదితరాలు అడిగి నమోదుచేస్తారు. అనంతరం ఓటరు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రాంతంలోకి వెళ్లి, అక్కడే ఉంచిన బ్యాలెట్ పేపరుపై తమకిష్టమైన వారి పేరుకు ఎదురుగా ముద్ర వేయాల్సి ఉంటుంది.