దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లలో అర్హులైన నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్… సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొత్తం 96 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో, ఛత్తీస్ గఢ్ లో 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక… ఈ నెల 19 న కౌంటింగ్ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని పార్టీ పేర్కొంది. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో… వారినే విజేతగా ప్రకటిస్తారు. ఈ బాధ్యతను పార్టీ ఎన్నికల సంఘం చైర్మన్ మిస్త్రీ తీసుకోనున్నారు.
ఇక… ఈ ఎన్నికల్లో మొదటి ఓటును పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఇతర నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా, పార్టీ నేత ప్రియాంక వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ ఇతర నేతలు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఓటు వేశారు. ఇక… కాంగ్రెస్ ఎంపీ యాత్రలో వున్న కారణంగా కర్నాటకలోని బళ్లారిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.