ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. మూడో విడత వైఎస్సార్ చేయూత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. 45 నుంచి 60 మధ్య వయస్సు మహిళలకు 18,759 చొప్పున సాయాన్ని విడుదల చేశారు. మొత్తంగా 26.39 లక్షల మందికి, 4,949 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లోనే సీఎం జమచేశారు. ఈ పథకం ద్వారా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందనుంది.
ఈ సందర్భంగా సీఎం జగన్ టీడీపీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 33 సంవత్సరాలు చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా వున్నారని, అలాంటి వ్యక్తి కుప్పానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తనకు కావాల్సింది చేసుకున్నారే తప్పించి, నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. చంద్రబాబు కుప్పంను ఏనాడు సొంత గడ్డగా భావించనేలేదని, హైదరాబాదే ముద్దు అని భావించారని మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్ కి లోకల్ అని, కుప్పంకు నాన్ లోకల్ అంటూ జగన్ విమర్శించారు. ప్రజలకు ఏం కావాలో కూడా ఆలోచించలేదన్నారు.
14 సంవత్సరాలు సీఎంగా వుండి, కుప్పం కరువుకు పరిష్కారం చూపలేకపోయారని, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే బాబు.. కుప్పంలో నీటి సమస్యను కూడా పరిష్కరించలేదని మండిపడ్డారు. కుప్పం మున్సిపాలిటీలో డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయారని, రోడ్లు కూడా వేయలేని బాబు.. విమానాశ్రయం తీసుకొస్తానని ప్రజలను మోసం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.