ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా సీఎం జగన్ బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జగన్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ, రోజా, ఎమ్మెల్యేలు కూడా వున్నారు. రంగనాయకుల మండపంలో సీఎం జగన్ కు అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం సీఎం జగన్ మంత్రులు, అధికారులతో కలిసి 22 కోట్లతో నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సీఎం జగన్ తిరుమల వెళ్లారు. మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ప్రతియేటా బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయం ప్రకారం సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజున తిరునామం, పంచెకట్టు, కండువాతో శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.