పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రానికి 4 జాతీయ అవార్డులు దక్కాయి. పర్యాటక రంగంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోలోని ఇండియా టూరిజం ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ అవార్డుల్ని అందుకున్నారు. టూరిజం సమగ్ర అభివృద్ధి, ఉత్తమ గోల్ఫ్ కోర్స్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, ఉత్తమ రైల్వే స్టేషన్ గా సికింద్రాబాద్, ఉత్తమ మెడికల్ టూరిజం ఫెసిలిటీగా అపోలో హాస్పిటల్స్ ఎంపికయ్యాయి.
ఈ అవార్డులను స్వీకరించిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఆనాడు పరిపాలన చేతకాదని, కరెంట్ వుండదని హేళన చేశారని, ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్ర దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. అప్పట్లో తెలంగాణలో తాగునీరు, కరెంట్ లేని కారణంగా వలసలు వెళ్లేవారని, ఇప్పుడు రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు.