రైతులకు ప్రతి అంశంలోనూ అండగానే వుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి అడుగులోనూ వారికి మంచే చేస్తున్నామని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధుల్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతన్నలకు 2,096.04 కోట్ల నగదును విడుదల చేశారు.
రైతులకు ఇంత తోడుగా వున్న రాష్ట్రం దేశంలోనే లేదని, క్యాలెండర్ ప్రకారం ప్రతి కుటుంబానికి అండగా వుంటున్నామని వివరించారు. మూడున్నరేళ్లలో రైతన్నల కోసం 1.33 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఇలాంటి మంచి పనులు కొన్ని మీడియా సంస్థలు కవర్ చేయవని మండిపడ్డారు. రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా సాయం అందించామని అన్నారు.
చంద్ర బాబు హయాంలో ఏటా కరువే….
ఈ సందర్భంగా సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఏటా కరువే వుండేదని ఎద్దేవా చేశారు. బాబు, కరువు రెండూ కవల పిల్లల అన్నట్లుగా పాలన సాగిందని జగన్ విమర్శించారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని సీఎం జగన్ ఆరోపించారు.