కుప్పం పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇస్తున్న 2,500 రూపాయల పెన్షన్ ను ఈ జనవరి నుంచి 2,750 రూపాయలకు పెంచుతున్నామని కీలక ప్రకటన చేశారు. 3 వేల వరకూ పెంచుకుంటూ వెళ్తానని మేనిఫెస్టోలో ప్రకటించామని, దానికి అనుగుణంగానే ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఒకటో తేదీన ఠంచనుగా పెన్షన్ వస్తుందని ప్రకటించారు. అక్క చెల్లెమ్మల సాధికారితే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందని సీఎం ప్రకటించారు.
కుప్పం వేదికగా సీఎం జగన్ మూడో విడత వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26,39,703 మంది మహిళలకు, 4,949.44 కోట్లు లబ్ధి పొందారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 26,39,703 మందికి వైఎస్సార్ చేయూత అందిందని, వరుసగా మూడోసారి నిధుల విడుదల చేశామని సీఎం జగన్ తెలిపారు.