కృష్ణంరాజుగారి సేవలు జ్ఞాపకాలు మరువలేనివి : సంతాప సందేశాన్ని షేర్ చేస్తూ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్

సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని AIGహాస్పిటల్‌లో క‌న్నుమూశారు. కృష్ణంరాజు ఇక లేర‌నే వార్త‌ను తెలుగ చిత్ర‌సీమ జీర్ణించుకోలేక‌పోతుంది. రాజకీయ, సినీ ప్ర‌ముఖులంద‌రూ సోష‌ల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ క్రమంలో చిరంజీవి ట్విట్ట‌ర్ ద్వారా సంతాప సందేశాన్ని షేర్ చేస్తూ కృష్ణంరాజుతో త‌న‌కున్న అనుబంధాన్ని తెలియజేశారు. ” శ్రీ కృష్ణంరాజుగారు ఇక లేరు అనే మాట ఎంతో విసాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో తొలిరోజుల నుండి పెద్దన్న లా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి ‘మన ఊరి పాండవులు ‘ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. అయన ‘రెబల్ స్టార్’ కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకు, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికి తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్ధిస్తూ… ఆయన కుటుంభం సభ్యులందరికి నా సంతాపం తెలియచేసుకుంటున్నాను.!” అంటూ పేర్కొన్నారు
నంద‌మూరి బాల‌కృష్ణ ట్విట్ట‌ర్ ద్వారా సంతాప సందేశాన్ని షేర్ చేస్తూ కృష్ణంరాజుతో త‌న‌కున్న అనుబంధాన్ని తెలియజేశారు. ‘‘మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజుగారి మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‌గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు కృష్ణంరాజుగారు. కృష్ణంరాజుగారితో కలసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. కృష్ణంరాజుగారితో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. కృష్ణరాజుగారు అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఆయన ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకునేవాడిని. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని అన్నారు నందమూరి బాలకృష్ణ.హీరో, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. త‌మ కుటుంబంతో ఆయ‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప‌వ‌న్. ఈ క్ర‌మంలో హీరో, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. త‌మ కుటుంబంతో ఆయ‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప‌వ‌న్. ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన కృష్ణంరాజుగారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా కుటుంబంతో కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో కృష్ణంరాజుగారితో కలసి అన్నయ్య చిరంజీవి గారు నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ‘భక్త కన్నప్ప’లో కృష్ణంరాజు గారి అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారు. బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయి. ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. కృష్ణంరాజుగారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని తెలిపారు పవన్ కళ్యాణ్.

Related Posts

Latest News Updates