చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారన్న వార్తలు అబద్ధాలని తేలిపోయాయి. జిన్‌పింగ్ గృహనిర్బంధంలో ఉన్నారన్న వార్తలకు తెరపడింది. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు తర్వాత తొలిసారిగా ఆయన బయట కనిపించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మంగళవారం నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. చైనా లక్షణాలతో కూడిన సోషలిజం కొత్త విజయం సాధించేందుకు ముందుకు సాగేలా ప్రయత్నాలు కూడా చేయాలని ఆయన నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో జిన్ పింగ్ హౌజ్ అరెస్ట్ అనేది తప్పుడు కథనమని తేలిపోయింది.
ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సుకు వెళ్లి… ఈ నెల 16 న జిన్ పింగ్ చైనాకు తిరిగి వచ్చారు. చైనాలో జీరో కోవిడ్ పాలసీని అనుసరిస్తున్న కారణంగా విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన జిన్ పింగ్… విధిగా 7 రోజుల పాటు క్వారంటైన్ లో వున్నారని కొందరు భావిస్తున్నారు. దీంతో ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారని, ఆయనను కీలక పదవి నుంచి ఆర్మీ తొలగించిందని సోషల్ మీడియాలో తెగ వార్తలొచ్చాయి. అయితే… ఈ వార్తలను చైనా ప్రభుత్వం ఖండించనూ లేదు. ఓ ప్రకటన కూడా జారీ చేయలేదు.