మనసానమ అనే లఘు చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు దీపక్ రెడ్డి, రివర్స్ స్క్రీన్‌ప్లేతో ప్రేమ నేపథ్యంతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ జాతీయ, అంతర్జాతీయంగా 513 అవార్డులు అందుకొని గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేరింది. ఆస్కార్ క్యాలిఫైయింగ్ స్క్రీనింగ్‌కీ ఎంపికైంది. దర్శకుడు దీపక్ రెడ్డికి వీసా జారీ కాకపోవటంతో అమెరికాలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు హాజరు కాలేకపోతున్నానని, తన సమస్యకు పరిష్కారం చూపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో నిర్వహించిన ఆస్కార్ క్యాలిఫైయింగ్ స్క్రీనింగ్ సహా 200లకు పైగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు వీసా ఆంక్షల కారణంగా వెళ్లలేకపోయానని పేర్కొన్నారు. ఇంకా మిగిలి ఉన్న ఫెస్టివల్స్‌లో అయినా పాల్గొనేందుకు యూఎస్ వీసా జారీ అయ్యేలా చూడాలంటూ సంబంధిత శాఖల వారికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు తాను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. ఒక్క ఫిల్మ్ ఫెస్టివల్‌లోనైనా భారత్ తరపున ప్రసంగం ఇవ్వాలనుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.