ఏపీ రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకు తలపెట్టిన మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. శాంతి భద్రతల నేపథ్యంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వడం కుదరది ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతి రావు, , శివారెడ్డి కలిసి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
అమరావతి రైతు ఉద్యమం ప్రారంభమై, 1000 రోజులకు చేరుకుంటున్న సందర్భంగా అమరావతి నుంచి అరసవల్లి వరకూ ఈ నెల 12 న పాదయాత్ర చేపట్టామని, అందుకు అనుమతి కావాలని హైకోర్టును అడిగారు. దీనిని మొదటి కేసుగా హైకోర్టు విచారించింది. పాదయాత్ర అనుమతి కోసం పోలీసులకు నేడే దరఖాస్తు చేసుకోవాలని రైతులకు హైకోర్టు సూచించింది. దరఖాస్తు పరిశీలన అనంతరం వెంటనే అనుమతులు ఇవ్వాలని హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. పాదయాత్రలో 600 మంది పాల్గొనేందుకు హైకోర్టు అనుమతులిచ్చింది.