ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించిన బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లను ఏపీ విద్యార్థులకు రిజర్వ్ చేస్తూ నిబంధనలను సవరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా సవరణలతో బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లు అంటే.. సుమారు 800 సీట్లు ప్రత్యేకంగా ఏపీ విద్యార్థుల కోసమే వుంటాయి.
మిగతా 15 శాతం సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడాల్సి వుంటుంది. ఓపెన్ కోటాలో కూడా ఏపీ విద్యార్థులు సీట్ సంపాదించుకునే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. ఏపీలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 15 ప్రైవేట్ కాలేజీలు, 2 మైనారిటీ కాలేజీలున్నాయి. కేవలం ప్రైవేట్ కాలేజీలో 2,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఈ యేడాది ప్రతి కాలేజీలో 50 సీట్ల చొప్పున పెంచారు.