వీఆర్ఏల డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సీఎస్ సోమేశ్ కుమార్, వీఆర్ఏ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల కోడ్ అమలులో వుందని, కోడ్ ఎత్తేయగానే.. వారి సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. వీఆర్ఏలు వెంటనే విధుల్లో చేరాలని సీఎస్ కోరారు. దీనికి వీఆర్ఏలు అంగీకరించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వీఆర్ఏలు 80 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక… ఉద్యోగ క్రమబద్ధీకరణ, సర్వీసు నిబంధనలు, పే స్కేలు వర్తింపు, పదోన్నతి, వారసత్వ ఉద్యోగాల కల్పన, సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవు దినంగా గుర్తించి, వేతనం మంజూరు చేయడం, పోలీసు కేసులు ఎత్తేయడం లాంటి అంశాలను వీఆర్ఏలు ప్రభుత్వంతో చర్చించారు. అయితే.. సమ్మె కాలంలో మరణించిన వీఆర్ఏలకు నష్టపరిహారం చెల్లించే అంశం సీఎం కేసీఆర్ కి చెప్పిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎస్ స్పష్టం చేశారు.