ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు

ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు తర్వాత చంద్రబాబు రాజ్ భవన్ బయట విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్సార్ యూనివర్శిటీగా మార్చడం అనాగరిక చర్య అని మండిపడ్డారు. శాసన సభలో వైసీపీ ప్రభుత్వం చీకటి చట్టాన్ని చేసిందని దుయ్యబట్టారు. తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ వుండిపోతారని, సినీ, రాజకీయ రంగాల్లో ఆయనకు ప్రత్యేక ముద్ర వుందన్నారు.

 

అంతగా వైఎస్సార్ పేరు పెట్టుకోవాలని అనిపిస్తే, వేరొక యూనివర్శిటీ నిర్మాణం చేసి, దానికి పేరు పెట్టుకుంటే.. తమకు అభ్యంతరం లేదన్నారు. అసలు ఎన్టీఆర్ పేరు తీసేయడానికి మనసెలా ఒప్పిందని ప్రశ్నించారు. ఎన్టీఆర్; వైఎస్సార్ మధ్య ఏ విషయంలో పోలిక వుందో చెప్పాలని డిమాండ్ చేశారు. వయస్సులోనా? సమాజ సేవలోనా? జీవితంలోనా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అసలు… హెల్త్ యూనివర్శిటీకి ఛాన్సలర్ గా వున్న గవర్నర్ కే పేరు మార్పు విషయంలో చెప్పలేదని, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు మారుస్తూ బిల్లు పెట్టడం అనైతికమని, దానిని తిరస్కరించాలని గవర్నర్ ను కోరామని బాబు పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates